Wednesday, December 12, 2012

మను చరిత్రము


మను చరిత్రము  లేదా స్వారోచిష మనుసంభవముఅల్లసాని పెద్దన రచించిన ఒక ప్రబంధ కావ్యము.

ప్రథమాశ్వాసము

అవతారిక 

ఇష్టదేవతా వందనము 

శ్రీవక్షోజ కురంగనాభ మెదపైఁ  జెన్నొంద విశ్వంభరా
దేవిం దత్కమలాసమీపమునఁ  బ్రీతిన్నిల్పినాఁ డో యనం
గా వందారు సనందనాది నిజభక్తశ్రేణికిం దోఁచు రా
జీవాక్షుండు గృతార్థుర్థుఁ జేయు శుభదృష్టిం గృష్ణరాయాధిపున్‌      [1]
ఉ. ఉల్లమునందు నక్కటికమూనుట మీకులమందుఁ  కంటిమం
    చల్లన మేలమాడు నచలాత్మజ మాటకు లేఁ తనవ్వు సం
    ధిల్లఁ  గిరీటిఁ  బాశుపత దివ్యశరాఢ్యునిఁ  జేయు శాంబరీ
    భిల్లుఁ డు గృష్ణరాయల కభీష్టశుభ ప్రతిపాది గావుతన్‌           [2]
నాలుగుమోములన్‌ నిగమనాదములుప్పతిలం ప్రచండవా
తూలగతిన్‌ జనించు రొదతోడిగుహావళి నొప్పు మేరువుం
బోలి పయోజపీఠి మునిముఖ్యులుగొల్వగ వాణిగూడి పే
రోలగమున్న ధాత విభవోజ్వ్జలుజేయుత కృష్ణరాయనిన్‌[ [[3]
అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బా
ల్యాంకవిచేష్ట తొండమున అవ్వలిచన్‌ కబళింపబోయి ఆ
వంక కుచంబు గాన కహివల్లభహారము గాంచి వే మృణా
ళాంకురశంక నంటెడు గజాస్యుని కొల్తు నభీష్టసిద్ధికిన్‌  [4]
చేర్చుక్కగానిడ్డ చిన్నిజాబిల్లిచే
        సిందూరతిలకంబు చెమ్మగిల్ల
నవతంస కుసుమంబునందున్న ఎలదేటి
       రుతి కించిదంచితశ్రుతుల నీన
ఘనమైన రారాపు చనుదోయి రాయిడి
       తుంబీఫలంబు తుందుడుకుజెంద
తరుణాంగుళిచ్ఛాయ దంతపుసరకట్టు
      లింగిలీకపు వింతరంగు లీన
ఉపనిషత్తులు బోటులై యోలగింప
పుండరీకాసనమున కూర్చుండి మదికి
నించువేడుక వీణవాయించు చెలువ
నలువరాణి మదాత్మలో వెలయుఁ గాత!
                                                                    గురుస్తుతి  
కొలుతున్‌ మద్గురు విద్యా
నిలయున్‌ కరుణా కటాక్ష నిబిడ జ్యోత్స్నా
దళితాశ్రితజన దురిత
చ్ఛల గాఢ ధ్వాంత సమితి శఠకోపయతిన్‌
పూర్వకవి ప్రస్తుతి   

వనజాక్షోపము వామలూరుతనయున్‌ ద్వైపాయనున్‌ భట్టబా
ణుని భాసున్‌ భవభూతి భారవి సుబంధున్‌ బిల్హణుం కాళిదా
సుని మాఘున్‌ శివభద్రు మల్హణకవిం చోరున్‌ మురారిన్‌ మయూ
రుని సౌమిల్లిని దండి ప్రస్తుతుల పేర్కొంచున్‌ వచశ్శుద్ధికిన్‌
వ్యాసరచిత భారతామ్నాయ మాంధ్రభా
షగ నొనర్చి జగతి పొగడు కనిన
నన్నపార్యు, తిక్కనను కృతక్రతు, శంభు
దాసు నెర్రసుకవి తలతు భక్తి
కుకవి నిరాకృతి 

భరమైతోచు కుటుంబరక్షణకుగా ప్రాల్మాలి చింతన్‌ నిరం
తర తాళీదళసంపుట ప్రకర కాంతారంబునం దర్థపుం
తెరువాటుల్‌ తెగికొట్టి తద్‌జ్ఞపరిషద్‌ విజ్ఞాత చౌర్యక్రియా
విరసుండై కొరతంబడుం కుకవి పృధ్వీభృ త్సమీపక్షితిన్‌
అని యిష్టదేవతా వం
దన సుకవిస్తుతులు కుకవితతి నికృతియు చే
సి నవీనకావ్యరచనకు
అనుకూలకథల్‌ తలచు ఆసమయమునన్‌
పెద్దనామాత్యునికుఁ  గృష్ణరాయని యభ్యర్ధనము 

ఉదయాచలేంద్రంబు మొదల నెవ్వాని కుమా
రతకు క్రౌంచాచలరాజమయ్యె
ఆవాడపతి సకంధర సింధురాధ్యక్షు
లరిగాపు లెవ్వాని ఖరతరాసి
కా పంచగౌడధాత్రీపదం బెవ్వాని
కసివారుగా నేగునట్టి బయలు
సకలయాచకజనాశాపూర్తి కెవ్వాని
ఘనభుజదండంబు కల్పశాఖి
ప్రబల రాజాధిరాజ వీరప్రతాప
రాజపరమేశ బిరుదవిభ్రాజి యెవ్వ
డట్టి శ్రీకృష్ణదేవరాయాగ్రగణ్యు
డొక్కనాడు కుతూహలంబుప్పతిల్ల
ఇందీవరంబులనీను క్రాల్గన్నుల
శరదిందుముఖులు చామరములిడగ
బణినసూను కణాద బాదరాయణ సూత్ర
ఫక్కి విద్వాంసు లుపన్యసింప
పార్శ్వభూమి నభీరు భటకదంబ కరాళ
హేతి చ్ఛటా చ్ఛాయ లిరులుకొనగ
సామంత మండనోద్దామ మాణిక్యాంశు
మండలం బొలసి యీరెండ కాయ
మూరురాయర గండ పెండార మణి మ
రీచి రింఛోళి కలయ నావృతములగుచు
అంకపాళి నటద్దుకూలాంచలములు
చిత్రమాంజిష్ట విభ్రమశ్రీ వహింప
భువనవిజయాఖ్య సంస
ద్భవన స్థిత భద్రపీఠి ప్రాజ్ఞులగోష్టిన్‌
కవితామధురిమ డెందము
తవులన్‌ కొలువుండి సదయతన్‌ నను పల్కెన్‌
సప్తసంతానములలో ప్రశస్తి గాంచి
ఖిలముకాకుండునది ధాత్రి కృతియ కాన
కృతి రచింపుము మాకు శిరీషకుసుమ
పేశల సుధామయూక్తుల పెద్దనార్య
హితుడవు చతురవచోనిధి
వతుల పురాణాగమేతిహాస కథార్థ
స్మృతియుతుడ వాంధ్రకవితా
పితామహుడ వెవ్వరీడు పేర్కొన నీకున్‌
మనువులలో స్వారోచిష
మనుసంభవ మరయ రససమంచిత కథలన్‌
విననింపు కలిద్వంసక
మనఘ భవచ్చతురరచన కనుకూలంబున్‌
కావున మార్కండేయ పురాణోక్త ప్రకారంబునం జెప్పుమని కర్పూరతాంబూలంబు వెట్టినం పట్టి మహాప్రసాదం బని మోదంబున నమ్మహాప్రబంధ నిబంధనంబునకు ప్రారంభించితి నేతత్కథా నాయకరత్నంబగు నమ్మహీనాథు వంశావతారం బెట్టిదనిన.

కృతిపతి వంస ప్రశంస 
కలశపాథోరాశి గర్భవీచి మతల్లి
కడుపార నెవ్వాని కన్నతల్లి
అనలాక్షు ఘనజటా వనవాటి కెవ్వాడు
వన్నెవట్టు ననార్తవంపు పువ్వు
సకల దైవత బుభుక్షాపూర్తి కెవ్వాడు
పుట్టు గానని మేని మెట్టపంట
కటికిచీకటి తిండి కరముల గిలిగింత
నెవ్వాడు దొగకన్నె నవ్వజేయు
నతడు వొగడొందు మధుకైటభారి మరది
కళల నెలవగువాడు చుక్కలకు రేడు
మిసిమి పరసీమ వలరాజు మేనమామ
వేవెలుంగుల దొర జోడు రేవెలుంగు
ఆ సుధాధాము విభవ మహాంబురాశి
కుబ్బు మీరంగ నందను డుదయమయ్యె
వేదవేదాంగ శాస్త్రార్థ విశద వాస
నాత్త ధిషణా ధురంధురుండైన బుధుడు
వానికి పురూరవుడు ప్ర
జ్ఞానిధి యుదయించె సింహసదృశుడు, తద్భూ
జానికి నాయువు తనయుం
డై నెగడె, నతండు గనె యయాతి నరేంద్రున్‌
అతనికి యదు తుర్వసు లను
సుతు లుద్భవమొంది రహిత సూదనులు కళా
న్వితమతులు వారిలో వి
శ్రుతకీర్తి వహించె తుర్వసుడు గుణనిధియై
వాని వంశంబు తుళువాన్వవాయ మయ్యె
నందు పెక్కండ్రు నృపు లుదయంబు నొంది
నిఖిల భువన ప్రపూర్ణ నిర్ణిద్రకీర్తి
నధికులైరి తదీయాన్వయమున బుట్టి
ఘనుడై తిమ్మ క్షితీశాగ్రణి
             శఠ కమఠ గ్రావ సంఘాత వాతా
శన రా డాశాంత దంతి స్థవిర కిరుల
             జంజాటముల్‌ మాన్పి యిమ్మే
దిని దోర్దండైక పీఠిన్‌ తిరముపరచి
              కీర్తిద్యుతుల్‌ రోదసిం బ
ర్వ నరాతుల్‌ నమ్రులై పార్స్వముల
             గొలువ తీవ్రప్రతాపంబు సూపెన్‌
వితరణఖని యా తిమ్మ
క్షితిపగ్రామణికి దేవకీదేవికి నం
చితమూర్తి యీశ్వర ప్రభు
డతిపుణ్యుడు పుట్టె సజ్జనావన పరుడై
బలమదమత్త దుష్టపుర భంజనుడై పరిపాలితార్యుడై
యిలపయి తొంటి యీశ్వరుడె యీశ్వరుడై జనియింప రూపరెన్‌
జలరుహనేత్రలం దొరగి శైలవనంబుల భీతచిత్తులై
మెలగెడు శత్రుభూపతుల మేనుల దాల్చిన మన్మథాంకముల్‌
నిజ భుజాశ్రిత ధారుణీ వజ్రకవచంబు
దుష్ట భుజంగాహి తుండికుండు
వనజేక్షణా మనోధన పశ్యతోహరుం
డరిహంస సంస దభ్రాగమంబు
మార్గణగణ పిక మధుమాస దివసంబు
గుణరత్న రోహణ క్షోణిధరము
బాంధవసందోహ పద్మవనీ హేళి
కారుణ్యరస నిమ్నగాకళత్రు
డన జగంబుల మిగుల ప్రఖ్యాతి గాంచె
ధరణిధవ దత్త వివిధోపదా విధా స
మార్జిత శ్రీ వినిర్జిత నిర్జరాల
యేశ్వరుడు తిమ్మభూపతి యీశ్వరుండు
ఆ యీశ్వరనృపతికి పు
ణ్యాయతమతియైన బుక్కమాంబకు తేజ
స్తోయజహితు లుదయించిరి
ధీయుతులగు నారసింహ తిమ్మ నరేంద్రుల్‌
అందు నరసప్రభుడు హరి
చందన మందార కుంద చంద్రాంశు నిభా
స్పంద యశ స్తుందిల ది
క్కందరుడై ధాత్రి యేలె కలుషము లడగన్‌
శ్రీరుచిరత్వ భూతి మతి జిత్వర తాకృతి శక్తి కాంతులన్‌
ధీరత సార భోగముల ధీనిధి యీశ్వర నారసింహు డా
వారిజనాభ శంకరుల వారికుమారుల వారితమ్ములన్‌
వారి యనుంగుమామలను వారి విరోధుల బోలు నిమ్మహిన్‌
అంభోధి వసన విశ్వంభరా వలయంబు
తన బాహుపురి మరకతము జేసె
నశ్రాంత విశ్రాణ నాసార లక్ష్మికి
కవికదంబము చాతకముల జేసె
కకుబంత నిఖిల రాణ్ణికరంబు చరణ మం
జీరంబు సాలభంజికల జేసె
మహనీయ నిజ వినిర్మల యశ స్సరసికి
గగనంబు కలహంసకంబు జేసె
నతి శిత కృపాణ కృత్త మత్తారివీర
మండలేశ సకుండల మకుట నూత్న
మస్త మాల్య పరంపరా మండనార్చి
తేశ్వరుండగు నారసింహేశ్వరుండు
ఆ నృసింహప్రభుడు తిప్పాంబ వలన
నాగమాంబిక వలన నందనుల గాంచె
వీరనరసింహరాయ భూవిభుని నచ్యు
తాంశసంభవు కృష్ణరాయ క్షితీంద్రు
వీరనృసింహుడు నిజభుజ
దారుణ కరవాల పరుష ధారా హత వీ
రారి యగుచు నేకాతప
వారణముగ నేలె ధర నవారణ మహిమన్‌
ఆ విభు ననంతరంబ ధ
రావలయము దాల్చె కృష్ణరాయడు చిన్నా
దేవియు శుభమతి తిరుమల
దేవియునుం దనకు కూర్చు దేవేరులు గాన్‌
కృష్ణరాయల ప్రతాపాది వర్ణనము 

తొలగెను ధూమకేతు క్షోభ జనులకు
నతివృష్టి దోష భయంబు వాసె
కంటకాగమ ధీతి గడచె నుద్ధత భూమి
భృత్కటకం బెల్ల నెత్తువడియె
మాసె నఘస్ఫూర్తి మరుభూము లందును
నెల మూడువానలు నిండ గురిసె
నాబాలగోపాల మఖిల సద్వ్రజమును
నానందమున మన్కి నతిశయిల్లె
ప్రజలకెల్లను కడు రామరాజ్య మయ్యె
చారుసత్వాఢ్యు డీశ్వర నారసింహ
భూవిభుని కృష్ణరాయ డభ్యుదయ మొంది
పెంపు మీరంగ ధాత్రి బాలింపుచుండ
అల ప్రోతిప్రభు దంష్ట్ర, భోగివర భోగాగ్రాళి రా, లుద్భటా
చల కూటోపల కోటి రూపు చెడ నిచ్చల్‌ రాయగా నైన మొ
క్కలు భూకాంతకు నున్ననయ్యె నరస క్ష్మాపాలు శ్రీకృష్ణరా
యల బాహా మృగనాభి సంకుమద సాంద్రాలేప పంకంబునన్‌
క్రూర వనేభ దంత హత కుడ్య పరిచ్యుత వజ్రపంక్తి బొ
ల్పారు మిడుంగురుంబురువు లంచు వెసన్‌ గొనిపోయి పొంత శృం
గార వన ద్రుమాళి గిజిగాడులు గూడుల జేర్చు దీపికల్‌
గా రహి కృష్ణరాయ మహికాంతుని శాత్రవ పట్టనంబులన్‌
తొలుదొల్త నుదయాద్రి శిల దాకి తీండ్రించు
నసిలోహమున వెచ్చనై జనించె
మరి కొండవీడెక్కి మార్కొని నలియైన
యల కసవాపాత్రు నంటి రాజె
నట సాగి జమ్మిలోయ బడి వేగి దహించె
గోన బిట్టేర్చె, కొట్టాన తగిలె
కనకగిరి స్ఫూర్తి గరచె గౌతమి గ్రాచె
నవుల నా పొట్నూర రవులుకొనియె
మాడెములు ప్రేల్చె నొడ్డాది మసి యొనర్చె
కటకపురి గాల్చె గజరాజు కలగి పరవ
తోకచిచ్చన నౌర యుద్ధురత కృష్ణ
రాయ బాహు ప్రతాప జాగ్రన్మహాగ్ని
ధర కెంధూళులు కృష్ణరాయల చమూధాటీ గతిన్‌ వింధ్య గ
హ్వరముల్‌ దూరగ జూచి, తా రచట కాపై యుండుటన్‌ చాల న
చ్చెరువై యెర్రని వింత చీకటులు వచ్చెం జూడరే యంచు వే
సొరిదిం జూతురు వీరరుద్ర గజరా ట్శుద్ధాంత ముగ్ధాంగనల్‌
అభిరతి కృష్ణరాయడు జయాంకములన్‌ లిఖియించి తాళ స
న్నిభముగ పొట్టునూరి కడ నిల్పిన కంబము సింహ భూధర
ప్రభు తిరునాళ్ళకున్‌ దిగు సురప్రకరంబు కళింగమేదినీ
విభు నపకీర్తి కజ్జలము వేమరు బెట్టి పఠించు నిచ్చలున్‌
ఎకరాలన్‌ మండువా సాహిణముల గల భద్రేభ సందోహ వాహ
ప్రకరంబున్‌ గొంచు తత్తత్ప్రభువులు వనుపన్‌ రాయబారుల్‌ విలోకో
త్సుకులై నిత్యంబు శ్రీకృష్ణుని యవసరముల్‌ చూతు రందంద కొల్వం
దక యా ప్రత్యూష మాసంధ్యము పనిపడి తన్మందిరాళింద భూమిన్‌
మద కలకుంభి కుంభ నవమౌక్తికముల్‌ కనుపట్టు దట్టమై
వదలక కృష్ణరాయ కరవాలమునం దగు ధారనీట న
భ్యుదయము నొంది శాత్రవుల పుట్టి మునుంగగ ఫేనపంక్తితో
బొదిగొని పైపయిన్‌ వెడలు బుద్బుదపంక్తులు వోలె పోరులన్‌
వేదండ భయద శుండాదండ నిర్వాంత
వమథువుల్‌ పైజిల్కు వారి గాగ
తత్కర్ణ విస్తీర్ణ తాళవృం తోద్ధూత
ధూళి చేటల జల్లు దుమ్ము గాగ
శ్రమ బుర్బుర త్తురంగమ నాసికాగళ
ద్పంకంబు వైచు కర్దమము గాగ
కుపిత యోధాక్షిప్త కుంత కాంతార ఖే
లనములు దండ ఘట్టనలు గాగ
చెనటి పగర ప్రతాపంబు చిచ్చు లార్చు
కరణి గడిదేశములు చొచ్చి కలచి యలచు
మూరు రాయర గండాంక వీర కృష్ణ
రాయ భూభృ ద్భయంకర ప్రబల ధాటి

షష్ట్యంతములు  
క. ఏవంవిధ గుణవంతున
    కావల్గాత్తురుగ బహు విధారోహా కళా 
   రేవంతున కతిశాంతున 
   కావిష్క్రుతకీర్తి ధవలితాశాంతునకున్  [43]

కరుణాకర వేంకటవిభు
చరణ స్మరణ ప్రసంగ సంగతమతి కీ
శ్వర నరసింహ మహీభృ
ద్వరనందన కృష్ణరాయ ధరణీపతికిన్‌
అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పం బూనిన స్వారోచిష మనుసంభవంబను మహాప్రబంధంబునకు కథాక్రమం బెట్టిదనిన జైమినిముని స్వాయంభువమను కథాశ్రవణానంతరంబున మీదనెవ్వండు మనువయ్యె నెరింగింపు మనవుడు పక్షులు మార్కండేయుండు క్రోష్టికిం జెప్పిన ప్రకారంబున నిట్లని చెప్పందొడంగె
వరణాద్వీపవతీ తటాంచలమునన్‌ వప్రస్థలీ చుంబితాం
బరమై సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయరుఙ్మండలీ
హరిణంబై అరుణాస్పదంబనగ ఆర్యావర్తదేశంబునన్‌
పురమొప్పున్‌ మహికంఠహార తరళ స్ఫూర్తిన్‌ విడంబింపుచున్‌
అచటి విప్రులు మెచ్చ రఖిలవిద్యాప్రౌఢి
ముది మదితప్పిన మొదటివేల్పు
నచటి రాజులు బంటునంపి భార్గవునైన
బింకాన పిలిపింతు రంకమునకు
అచటి మేటికిరాటు లలకాధిపతినైన
మును సంచిమొదలిచ్చి మనుప దక్షు
లచటి నాలవజాతి హలముఖాత్తవిభూతి
నాదిభిక్షువు భైక్షమైన మాన్చు
నచటి వెలయాండ్రు రంభాదులైన నరయ
కాసెకొంగున వారించి కడపగలరు
నాట్యరేఖా కళా ధురంధర నిరూఢి
నచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ
ఆ పురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భా
షాపరశేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ
క్షాపరతంత్రు డంబురుహగర్భ కులాభరణం బనారతా
ధ్యాపనతత్పరుండు ప్రవరాఖ్యు డలేఖ్యతనూవిలాసుడై
వాని చక్కదనము వైరాగ్యమున చేసి
కాంక్షసేయు జారకామినులకు
భోగబాహ్యమయ్యె పూచిన సంపెంగ
పొలుపు మధుకరాంగనలకు బోలె
యౌవనమందు యజ్వయు ధనాఢ్యుడునై కమనీయ కౌతుక
శ్రీవిధి కూకటుల్‌ కొలిచి చేసిన కూరిమి సోమిదమ్మ సౌ
ఖ్యావహయై భజింప సుఖులై తలిదండ్రులు కూడి దేవియున్‌
దేవరవోలెనుండి ఇలుదీర్పగ కాపురమొప్పు వానికిన్‌
వరణాతరంగణీ దరవికస్వర నూత్న
కమల కషాయగంధము వహించి
ప్రత్యూషపవనాంకురములు పైకొను వేళ
వామనస్తుతిపరత్వమున లేచి
సచ్ఛాత్రుడగుచు నిచ్చలు నేగి అయ్యేట
అఘమర్షణస్నాన మాచరించి
సాంధ్యకృత్యము తీర్చి సావిత్రి జపియించి
సైకతస్థలి కర్మసాక్షి కెరగి
ఫల సమిత్కుశ కుసుమాది బహుపదార్థ
తతియు నుదికినదోవతులు కొంచు
బ్రహ్మచారులు వెంటరా బ్రాహ్మణుండు
వచ్చు నింటికి ప్రజ తన్ను మెచ్చిచూడ
శీలంబుం కులమున్‌ శమంబు దమముం చెల్వంబు లేబ్రాయముం
పోలంజూచి ఇతండె పాత్రుడని ఏ భూపాలు డీవచ్చినన్‌
సాలగ్రామము మున్నుగా కొనడు మాన్యక్షేత్రమున్‌ పెక్కుచం
దాలం పండు నొకప్పుడుం తరుగ దింటం పాడియుం పంటయున్‌
వండనలయదు వేవురు వచ్చిరేని
అన్నపూర్ణకు నుద్దియౌ అతని గృహిణి
అతిథులేతేర నడికిరేయైన పెట్టు
వలయు భోజ్యంబు లింట నవ్వారి కాగ
తీర్థసంవాసు లేతెంచినారని విన్న
ఎదురుగా నేగు దవ్వెంతయైన
ఏగి తత్పదముల కెరగి ఇంటికి తెచ్చు
తెచ్చి సద్భక్తి నాతిథ్యమిచ్చు
ఇచ్చి ఇష్టాన్నసంతృప్తులుగా చేయు
చేసి కూర్చున్నచో చేరవచ్చు
వచ్చి ఇద్ధరకల్గు వనధి పర్వత సరి
త్తీర్థ మాహాత్మ్యముల్‌ తెలియనడుగు
అడిగి యోజనపరిమాణ మరయు అరసి
పోవలయుచూడ ననుచు ఊర్పులు నిగుడ్చు
అనుదినము తీర్థసందర్శనాభిలాష
మాత్మనుప్పొంగ అత్తరుణాగ్నిహోత్రి
ఈవిధమున నభ్యాగత
సేవాపరతంత్ర సకల జీవనుడై భూ
దేవకుమారకు డుండం
గా వినుమొకనాడు కుతపకాలము నందున్‌
ముడిచిన యొంటికెంజెడ మూయ మువ్వన్నె
మెగముతోలు కిరీటముగ ధరించి
కకపాల కేదార కటక ముద్రిత పాణి
కురుచ లాతాముతో కూర్చిపట్టి
ఐణేయమైన ఒడ్డాణంబు లవణిచే
నక్కళించిన పొట్టమక్కళించి
ఆరకూటచ్ఛాయ నవఘళింపగ చాలు
బడుగుదేహంబున భస్మమలది
మిట్టయురమున నిడుయోగపట్టె మెరయ
చెవుల రుద్రాక్షపోగులు చవుకళింప
కావికుబుసంబు జలకుండికయును పూని
చేరె తద్గేహ మౌషధసిద్ధు డొకడు
ఇట్లు చనుదెంచు పరమయోగీంద్రు కాంచి
భక్తి సంయుక్తి నెదురేగి ప్రణతుడగుచు
అర్య్ఘపాద్యాది పూజనం బాచరించి
ఇష్టమృష్టాన్న కలన సంతుష్టు చేసి
ఎందుండి ఎందుపోవుచు
ఇందులకేతెంచినార లిప్పుడు విద్వ
ద్వందిత నేడుగదా మ
న్మందిరము పవిత్రమయ్యె మాన్యుడనైతిన్‌
మీమాటలు మంత్రంబులు
మీమెట్టినయెడ ప్రయాగ మీపాదపవి
త్రామల తోయము లలఘు
ద్యోమార్గచరాంబు పౌనరుక్య్తము లుర్విన్‌
వానిది భాగ్యవైభవము వానిది పుణ్యవిశేష మెమ్మెయిన్‌
వాని దవంధ్యజీవితము వానిది జన్మము వేరుసేయ కె
వ్వాని గృహాంతరంబున భావాదృశ యోగిజనంబు పావన
స్నానవి ధాన్నపానముల సంతసమందుచు ప్రోవు నిచ్చలున్‌
మౌనినాథ కుటుంబ జంబాల పటల
మగ్న మాదృశ గృహమేధిమండలంబు
నుద్ధరింపంగ నౌషధమొండు కలదె
యుష్మదంఘ్రిరజో లేశమొకటి తక్క
నావిని ముని ఇట్లను వ
త్సా మావంటి తైర్థికావళి కెల్లన్‌
మీవంటి గృహస్థుల సుఖ
జీవనమున కాదె తీర్థసేవయు తలపన్‌
కెలకులనున్న తంగెటిజున్ను గృహమేథి
యజమాను డంకస్థితార్థపేటి
పండిన పెరటికల్పకము వాస్తవ్యుండు
దొడ్డిబెట్టిన వేల్పుగిడ్డి కాపు
కడలేని అమృతంపునడబావి సంసారి
సవిద మేరునగంబు భవనభర్త
మరుదేశ పథమధ్య ప్రప కులపతి
ఆకటికొదవు సస్యము కుటుంబి
బధిర పం గ్వంధ భిక్షుక బ్రహ్మచారి
జటి పరివ్రాజ కాతిథి క్షపణ కావ
ధూత కాపాలికా ద్యనాథులకు కాన
భూసురోత్తమ గార్హత్యమునకు సరియె
నావుడు ప్రవరుం డిట్లను
దేవా దేవర సమస్త తీర్థాటనమున్‌
కావింపుదు రిలపై నటు
కావున విభజించి అడుగ కౌతుకమయ్యెన్‌
ఏయే దేశములన్‌ చరించితిరి మీరేయే గిరుల్‌ చూచినా
రేయే తీర్థములందు క్రుంకిడితి రేయే ద్వీపముల్‌ మెట్టినా
రేయే పుణ్యవనాళి ద్రిమ్మరితి రేయే తోయధుల్‌ డాసినా
రాయా చోటులకల్గు వింతలు మహాత్మా నాకెరింగింపవే
పోయి సేవింపలేకున్న పుణ్యతీర్థ
మహిమ వినుటయు నఖిల కల్మషహరంబ
కాన వేడెదననిన అమ్మౌనివర్యు
డాదరాయత్తచిత్తుడై అతని కనియె
ఓ చతురాస్యవంశ కలశోదధి పూర్ణశశాంక తీర్థయా
త్రాచణశీలినై జనపదంబులు పుణ్యనదీనదంబులున్‌
చూచితి నందు నందు గల చోద్యములన్‌ కనుగొంటి నాపటీ
రాచల పశ్చిమాచల హిమాచల పూర్వదిశాచలంబుగన్‌
కేదారేశు భజించితిన్‌ శిరమునన్‌ కీలించితిన్‌ హింగుళా
పాదాంభోరుహముల్‌ ప్రయాగనిలయుం పద్మాక్షు సేవించితిన్‌
యాదోనాథసుతాకళత్రు బదరీనారాయణుం కంటి నీ
యా దేశంబననేల చూచితి సమస్తాశావకాశంబులన్‌
అదియట్లుండె వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరధతురంగ శృంగార చారుచామర చ్ఛటా ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమరసముదయంబగు నుదయంబునంగల విశేషంబులు శేషఫణికినైన లెక్కింప శక్యంబె అంధకరిపు కంధరావాస వాసుకి వియోగభవజుర్వ్యథాభోగ భోగినీ భోగభాగ పరివేష్టిత పటీర విటపివాటికా వేల్లదేలా లతావలయంబగు మలయంబునంగల చలువకు విలువ యెయ్యది అకటకట వికట కూటకోటి విటంక శృంగాటకాడౌకమాన జరదిందుబింబ గళదమృతబిందు దుర్దినార్దీకృత చల్లకీపల్లవ ప్రభంజన పరాంజన హస్తిహస్తంబగు అస్తంబునంగల మణిప్రస్తరంబుల విశ్రాంతిం జింతించిన మేనం బులక లిప్పుడుం బొడమెడు స్వస్వప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహసందోహ దోహద ప్రధానాసమాన ఖేలదైలబిల విలాసినీ విలాస వాచాల తులాకోటి కలకలాహుమాన మానస మదాలస మరాళంబగు రజతశైలంబు నోలంబులం కాలగళు విహారప్రదేశంబులంగన్న సంస్రృతిక్లేశంబులు వాయవే సతత మదజల స్రవణపరాయ ణైరావణ విషాణకోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్కురువింద కందళవ్రాత జాతాలాత శంకాపసర్పదభ్రము భ్రమీవిభ్రమ ధురంధరంబగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం గనుంగొనుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక యేల చేకూరనేర్చు నేనిట్టి మహాద్భుతంబు లీశ్వరానుగ్రహంబున స్వల్పకాలంబునం గనుంగొంటి ననుటయు ఈషదంకురిత హసన గ్రసిష్ణు గండయుగళుండగుచు ప్రవరుం డతని కిట్లనియె
వెరవక మీకొనర్తునొక విన్నప మిట్టివియెల్ల చూచిరా
నెరకలుకట్టుకొన్న మరి యేండ్లును పూండ్లును పట్టు ప్రాయపుం
జిరుతతనంబు మీమొగము చెప్పకచెప్పెడు నద్దిరయ్య మా
కెరుగ తరంబె మీమహిమ లీర యెరుంగుదు రేమిచెప్పుదున్‌
అనిన పరదేశి గృహపతి
కనియెన్‌ సందియము తెలియనడుగుట తప్పా
వినవయ్య జరయు రుజయును
చెనకంగా వెరచుమమ్ము సిద్ధులమగుటన్‌
పరమంబైన రహస్యమౌ నయిన డాపన్‌ చెప్పెదన్‌ భూమిని
ర్జరవంశోత్తమ పాదలేపమను పేరంగల్గు దివ్యౌషధం
పు రసం బీశ్వరసత్కృపంగలిగె తద్భూరిప్రభావంబునం
చరియింతుం పవమాన మానస తిరస్కారి త్వరాహంకృతిన్‌
దివి బిసరుహబాంధవ సైం
ధవసంఘం బెంతదవ్వు దగలేకరుగున్‌
భువి నంత దవ్వు నేమును
ఠవఢవ లే కరుగుదుము హుటాహుటి నడలన్‌
అనినన్‌ విప్రవరుండు కౌతుకభరవ్యగ్రాంతరంగుండు భ
క్తి నిబద్ధాంజలి బంధురుండునయి మీ దివ్యప్రభావం బెరుం
గని నా ప్రల్లదముల్‌ సహించి మునిలోకగ్రామణీ సత్కృపన్‌
నను మీ శిష్యుని తీర్థయాత్ర వలనన్‌ ధన్యాత్ముగా చేయరే
అనుటయు రసలింగము నిడు
తన వట్రువ ప్రేపసజ్జ దంతపుబరణిన్‌
నినిచిన యొకపస రిదియది
అనిచెప్పక పోసె తత్పదాంబుజయుగళిన్‌
ఆ మందిడి అతడరిగిన
భూమీసురుడరిగె తుహినభూధర శృంగ
శ్యామల కోమల కానన
హేమాఢ్య దరీ ఝరీ నిరీక్షాపేక్షన్‌
అనిన విని యమ్మహీసురవరు డట్లరిగి యెట్లు ప్రవర్తించె నతని పుణ్యవర్తనశ్రవణంబు మనంబునకు హర్షోత్కర్షంబు కల్పించె తరువాతి వృత్తాంతంబు కృపాయత్తచిత్తంబున నానతీయవలయునని యడుగుటయును
గంగా స్వచ్ఛ తరంగ భంగిక యశో గాఢ చ్ఛవి చ్ఛన్న సా
రంగాంకాంక నిరంకుశ ప్రతికళా ప్రౌఢి ప్రియంభావుకా
గాంగేయాచలదాప నూపుర వచో గాంభీర్య లీలాస్పదా
బంగాళాంగ కళింగ భూప సుభటాభ్రశ్రేణి ఝంఝానిలా
మండలిక తపనశోభిత
కుండలపతిశయన కర్ణకుండలిత రసా
ఖండ కవికావ్య దిగ్వే
దండ శ్రుతిదళన కలహతాడిత పటహా
కుకురు కాశ కురు కరూశ కోస లాంధ్ర సింధు భా
హ్లిక శకాంగ వంగ సింహళేశ కన్యకామణి
ప్రకర పాణిఘటిత రత్నపాదుకా కలాచికా
ముకుర వీటికా కరండ ముఖ్య రాజలాంఛనా
ఇది శ్రీమదాంధ్ర కవితాపితామహ సర్వతోముఖాంక పంకజాక్ష పాదాంబుజాధీన మానసేందిందిర నందవరపుర వంశోత్తంస శఠకోపతాపస ప్రసాదాసాదిత చతుర్విధ కవితా మతల్లి కాల్లసాని చొక్కయామాత్యపుత్త్ర పెద్దనార్యప్రణీతంబైన స్వారోచిషమనుసంభవంబను మహాప్రబంధంబునందు ప్రథమాశ్వాసము

సుమతీ శతకము

బద్దెన అనే కవి రచించాడు 

శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగఁ జవులు పుట్ట నుడివెద సుమతీ! [1]



అక్కఱకు రాని చుట్టము,
మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమునఁ దా
నెక్కిన బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడవంగవలయుఁ గదరా సుమతీ! [2]



అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దులఁ గట్టుక
మడి దున్నుక బ్రతుక వచ్చు మహిలో సుమతీ! [3]



అడియాస కొలువుఁ గొలువకు,
గుడి మణియము సేయఁబోకు, కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు,
మడవిని దోడరకొంటి నరుగకు సుమతీ! [4]



అధరము గదలియు, గదలక
మధురములగు భాష లుడుగి మౌన వ్రతుఁడౌ
అధికార రోగ పూరిత
బధిరాంధక శవముఁ జూడ బాపము సుమతీ! [5]



అప్పు కొని చేయు విభవము,
ముప్పున బృఆయంపుటాలు, మూర్ఖుని తపమున్,
దప్పరయని నృపు రాజ్యము
దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ! [6]



అప్పిచ్చువాఁడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక పాఱు నేఱును, ద్విజుఁడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు సొఱకుము సుమతీ! [7]



అల్లుని మంచితనంబు,
గొల్లని సాహిత్య విద్య, కోమలి నిజమున్,
బొల్లున దంచిన బియ్యము,
దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ! [8]



ఆఁకొన్న కూడె యమృతము,
తాఁకొంచక నిచ్చువాఙ్డె దాత ధరిత్రిన్,
సోఁకోర్చువాఁడె మనుజుఁడు,
తేఁకువ గలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ! [9]



ఆఁకలి యుడుగని కడుపును,
వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్,
బ్రాఁకొన్న నూతి యుదకము,
మేఁకల పాడియును రోఁత మేదిని సుమతీ! [10]



ఇచ్చునదే విద్య, రణమున
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్
మెచ్చునదే నేర్చు, వదుకు
వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ! [11]



ఇమ్ముగ జదువని నోరును,
నమ్మా యని బిలిచి యన్న మడుగని నోరున్,
దమ్ముల బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ! [12]



ఉడుముండదె నూరేండ్లును,
బడియుండదె పేర్మిఁ బాము పదినూరేండ్లున్,
మడువునఁ గొక్కెర యుండదె,
కడు నిలఁ బురుషార్థ పరుఁడు గావలె సుమతీ! [13]



ఉత్తమగుణములు నీచున
కెత్తెఱగున గలుగ నేర్చు; నెయ్యెడలం దా
నెత్తిచ్చి కరఁగి పోసిన
నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ! ? [14]



ఉదకము ద్రావెడు హయమును,
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్,
మొదవు కడ నున్న వృషభము,
జదువని యానీచుఁ గడకు జనకుర సుమతీ! [15]



ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా;
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాఁడు నేర్పరి సుమతీ! [16]



ఉపమింప మొదలు తియ్యన
కపటం బెడనెడను జెఱకు కై వడినే పో
నెపములు వెదకును గడపట
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ! [17]



ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్
నొప్పించక, తా నొవ్వక,
తప్పించుక తిరుగువాఁడు ధన్యుడు సుమతీ! [18]



ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వఁగూడ దది యెట్లన్నన్
సర్పంబు పడగ నీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ! [19]



ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్
తెప్పలుఁగ జెఱువు నిండిన
గప్పలు పదివేలు చేరుఁ గదరా సుమతీ! [20]



ఏఱకుమీ కసుగాయలు,
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ,
పాఱకుమీ రణమందున,
మీఱకుమీ గురువు నాజ్ఞ మేదిని సుమతీ! [21]



ఒక యూరికి నొక కరణము,
నొక తీర్పరియైనఁ గాక, నొగిఁ దఱుచైనన్,
గకవికలు గాక యుండునె
సకలంబును గొట్టువడక సహజము సుమతీ! [22]



ఒరు నాత్మఁ దలఁచు సతి విడు,
మఱుమాటలు పలుకు సతుల మన్నింపకుమీ,
వెఱ పెఱుగని భటునేలకు,
తఱచుగ సతి గవయఁ బోకు, తగదుర సుమతీ! [23]



ఒల్లని సతి నొల్లని పతి,
నొల్లని చెలికాని విడువ నొల్లని వాఁడే
గొల్లండు, కాక ధరలో
గొల్లండును గొల్లడౌనె గుణమున సుమతీ! [24]



ఓడల బండ్లును వచ్చును,
ఓడలు నాబండ్లమీఁద నొప్పుగ వచ్చున్,
ఓడలు బండ్లును వలనే
వాడంబడు గలిమి లేమి వసుధను సుమతీ! [25]



కడు బలవంతుఁడైనను
బుడమిని బ్రాయంపుటాలిఁ బుట్టిన యింటన్
దడవుండ నిచ్చెనేనియుఁ
బడుపుగ నంగడికిఁ దానె బంపుట సుమతీ! [26]



కనకపు సింహాసనమున
శునకముఁ గూర్చుండబెట్టి శుభ లగ్నమునం
దొనరగఁ బట్టముఁ గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ! [27]



కప్పకు నొరగాలైనను,
సర్పమునకు రోగమైన, సతి తులువైనన్,
ముప్పున దరిద్రుఁడైనను,
తప్పదు మఱి దుఃఖ మగుట తథ్యము సుమతీ! [28]



కమలములు నీటఁ బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ! [29]



కరణముఁ గరణము నమ్మిన
మరణాంతక మౌను గాని మనలేడు సుమీ;
కరణము దన సరి కరణము
మఱి నమ్మక మర్మ మీక మనవలె సుమతీ! [30]



కరణముల ననుసరింపక
విరసంబునఁ దిన్న తిండి వికటించు జుమీ
యిరుసునఁ కందెనఁ బెట్టక
పరమేశ్వరు బండి యైనఁ బారదు సుమతీ! [31]



కరణము సాదైయున్నను,
గరి మద ముడిగినను, బాము గఱవక యున్నన్,
ధరఁ దేలు మీటకున్నను,
గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ! [32]



కసుగాయ గఱచి చూచిన
మసలక పస యొగరు రాక మధురంబగునా;
పస గలుగు యువతులుండగ
పసి బాలలఁ బొందువాఁడు పశువుర సుమతీ! [33]



కవి కాని వాని వ్రాతయు,
నవరస భావములు లేని నాతుల వలపున్,
దవిలి చను పంది నేయని
వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతీ! [34]



కాదు సుమీ దుస్సంగతి,
పోదుసుమీ "కీర్తి" కాంత పొందిన పిదపన్,
వాదు సుమీ యప్పిచ్చుట,
లేదు సుమీ సతుల వలపు లేశము సుమతీ! [35]



కాముకుఁడు దనిసి విడిచిన
కోమలిఁ బరవిటుఁడు గవయ గోరుట యెల్లన్
బ్రేమమునఁ జెఱకు పిప్పికి
చీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ! [36]



కారణము లేని నగవును,
బేరణము లేని లేమ, పృథివీ స్థలిలోఁ
బూరణము లేని బూరెయు,
వీరణము లేని పెండ్లి వృధరా సుమతీ! [37]



కులకాంత తోడ నెప్పుడు
గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ,
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ! [38]



కూరిమి గల దినములలో
నేరము లెన్నఁడును గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోఁచు చుండు నిక్కము సుమతీ! [39]



కొంచెపు నరు సంగతిచే
నంచితముగఁ గీడు వచ్చు నది యెట్లన్నన్
గించిత్తు నల్లి కుట్టిన
మంచమునకుఁ జేటు వచ్చు మహిలో సుమతీ! [40]



కొక్కోకమెల్లఁ జదివిన,
చక్కనివాఁడైన, రాజ చంద్రుండైనన్,
మిక్కిలి రొక్కము లియ్యక,
చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ! [41]



కొఱ గాని కొడుకు బుట్టిన
కొఱ గామియె కాదు, తండ్రి గుణములఁ జెఱచున్
చెఱకు తుద వెన్ను బుట్టిన
జెఱకున తీపెల్లఁ జెఱచు సిద్ధము సుమతీ! [42]



కోమలి విశ్వాసంబును,
బాములతోఁ జెలిమి, యన్య భామల వలపున్,
వేముల తియ్యదనంబును,
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ! [43]



గడన గల మగనిఁ జూచిన
నడుగడుగున మడుగు లిడుదు రతివలు దమలో;
గడ నుడుగు మగనిఁ జూచిన
నడ పీనుగు వచ్చె నంచు నగుదురు సుమతీ! [44]



చింతింపకు కడచిన పని,
కింతులు వలతురని నమ్మ కెంతయు మదిలో,
నంతఃపుర కాంతలతో
మంతనముల మాను మిదియె మతముర సుమతీ! [45]



చీమలు పెట్టిన
పుట్టలు పాముల కిరవైనయట్లు పామరుఁడు దగన్
హేమంబుఁ గూడ బెట్టిన
భూమీశుల పాలఁ జేరు భువిలో సుమతీ! [46]



చుట్టములు గాని వారలు
చుట్టములము నీకటంచు సొంపు దలిర్పన్
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ! [47]



చేతులకుఁ దొడవు దానము,
భూతలనాథులకుఁ దొడవు బొంకమి ధరలో,
నీతియె తొడవెవ్వారికి,
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ! [48]



తడ వోర్వక, యొడ లోర్వక,
కడు వేగం బడిచి పడిన గార్యం బగునే;
తడ వోర్చిన, నొడ లోర్చిన,
జెడిపోయిన కార్యమెల్లఁ జేకుఱు సుమతీ! [49]



తన కోపమె తన శత్రువు,
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము,
తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ! [50]



తన యూరి తపసి తపమును,
తన పుత్రుని విద్య పెంపు, దన సతి రూపున్,
దన పెరటి చెట్టు మందును,
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ! [51]



తన కలిమి యింద్ర భోగము,
తన లేమియె స్వర్గలోక దారిద్ర్యంబున్,
దన చావు జల ప్రళయము,
తను వలచిన యదియె రంభ తథ్యము సుమతీ! [52]



తన వారు లేని చోటను,
జనమించుక లేని చోట, జగడము చోటన్,
అనుమానమైన చోటను,
మనుజునకును నిలువఁ దగదు మహిలో సుమతీ! [53]



తమలము వేయని నోరును,
విమతులతో చెలిమి చేసి వెతబడు తెలివిన్,
గమలములు లేని కొలకును,
హిమధాముఁడు లేని రాత్రి హీనము సుమతీ! [54]



తలనుండు విషము ఫణికిని,
వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్,
తల తోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ! [55]



తలపొడుగు ధనము పోసిన
వెలయాలికిఁ నిజము లేదు వివరింపంగా
దలఁ దడివి బాసఁ జేసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ! [56]



తల మాసిన, నొలు మాసిన,
వలువలు మాసినను బ్రాణ వల్లభునైనన్
గులకాంతలైన రోఁతురు
తిలకింపగ భూమిలోనఁ దిరముగ సుమతీ! [57]



తాను భుజింపని యర్థము
మానవ పతిఁ జేరుఁ గొంత మఱి భూగతమౌఁ
గానల నీగలు గూర్చిన
తేనియ యొరుఁ జేరునట్లు తిరముగ సుమతీ! [58]



దగ్గఱ కొండెము సెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మఱిఁ దా
నెగ్గు బ్రజ కాచరించుట
బొగ్గులకై కల్పతరువుఁ బొడుచుట సుమతీ! [59]



ధనపతి సఖుడై యుండిన
నెనయంగా శివుఁడు భిక్షమెత్తఁగ వలసెన్;
దన వారి కెంత గలిగినఁ
దన భాగ్యమె తనకుఁ గాక తథ్యము సుమతీ! [60]



ధీరులకుఁ జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గౌరవమును మఱి మీఁదట
భూరి సుఖావహము నగును భువిలో సుమతీ! [61]



నడువకుమీ తెరువొక్కట,
గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్,
ముడువకుమీ పరధనముల,
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ! [62]



నమ్మకు సుంకరి, జూదరి,
నమ్మకు మొగసాల వాని, నటు వెలయాలిన్,
నమ్మకు మంగడి వానిని,
నమ్మకు మీ వామ హస్తు నవనిని సుమతీ! [63]



నయమునఁ బాలుం ద్రావరు,
భయమునను విషమ్మునైన భక్షింతురుగా;
నయమెంత దోషకారియొ,
భయమే జూపంగ వలయు బాగుగ సుమతీ! [64]



నరపతులు మేఱఁ దప్పినఁ,
దిరమొప్పఁగ విధవ యింటఁ దీర్పరి యైనన్,
గరణము వైదికుఁడైనను,
మరణాంతక మౌనుగాని మానదు సుమతీ! [65]



నవరస భావాలంకృత
కవితా గోష్టియును, మధుర గానంబును దా
నవివేకి కెంతఁ జెప్పిన
జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ! [66]



నవ్వకుమీ సభ లోపల;
నవ్వకుమీ తల్లి, దండ్రి, నాథుల తోడన్;
నవ్వకుమీ పరసతితో;
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ! [67]



నీరే ప్రాణాధారము
నోరే రసభరితమైన నుడువుల కెల్లన్
నారియె నరులకు రత్నము
చీరయె శృంగారమండ్రు సిద్ధము సుమతీ! [68]



పగవల దెవ్వరి తోడను,
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్,
దెగ నాడ వలదు సభలను
మగువకు మనసియ్య వలదు మహిలో సుమతీ! [69]



పతికడకుఁ, దన్నుఁ గూరిన
సతికడకును, వేల్పు కడకు, సద్గురు కడకున్,
సుతుకడకు రిత్తచేతుల
మతిమంతులు చనరు నీతి మార్గము సుమతీ! [70]



పనిచేయునెడల దాసియు,
ననుభవమున రంభ, మంత్రి యాలోచనలన్,
దనభుక్తి యెడలఁ దల్లియు,
నన్ఁ దన కులకాంత యుండు నగురా సుమతీ! [71]



పరనారీ సోదరుఁడై,
పరధనముల కాసపడక, పరులకు హితుఁడై,
పరులు దనుఁ బొగడ నెగడక,
పరు లలిగిన నలుగ నతఁడు పరముఁడు సుమతీ! [72]



పరసతి కూటమి గోరకు,
పరధనముల కాసపడకుఁ, బరునెంచకుమీ,
సరిగాని గోష్టి సేయకు,
సిరిచెడి చుట్టంబు కడకు జేరకు సుమతీ! [73]



పరసతుల గోష్ఠి నుండిన
పురుషుఁడు గాంగేయుఁడైన భువి నింద పడున్,
బరసతి సుశీలయైనను
బరుసంగతి నున్న నింద పాలగు సుమతీ! [74]



పరులకు నిష్టము సెప్పకు,
పొరుగిండ్లకుఁ బనులు లేక పోవకు మెపుడున్,
బరుఁ గదిసిన సతిఁ గవయకు,
మెఱిఁగియుఁ బిరుసైన హయము లెక్కకు సుమతీ! [75]



పర్వముల సతులఁ గవయకు,
ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలో,
గర్వింప నాలిఁ బెంపకు,
నిర్వహణము లేని చోట నిలువకు సుమతీ! [76]



పలు దోమి సేయు విడియము,
తలగడిగిన నాటి నిద్ర, తరుణులయెడలన్
బొల యలుక నాఁటి కూటమి
వెల యింతని చెప్పరాదు వినరా సుమతీ! [77]



పాటెఱుఁగని పతి కొలువును,
గూటంబున కెఱుకపడని కోమలి రతియున్,
బేటెత్తఁ జేయు చెలిమియు,
నేటికి నెదురీఁదినట్టు లెన్నఁగ సుమతీ! [78]



పాలను గలసిన జలమును
పాల విధంబుననె యుండుఁ బరికింపంగా
పాల చవి జెఱచుఁ గావున
పాలసుఁడగు వాని పొందు వలదుర సుమతీ! [79]



పాలసునకైన యాపద
జాలింబడి తీర్పఁ దగదు సర్వజ్ఞునకున్
తేలగ్నిఁ బడఁగఁ బట్టిన
మేలెఱుఁగునె మీటుఁ గాక మేదిని సుమతీ! [80]



పిలువని పనులకుఁ బోవుటఁ,
గలయని సతి గతియు, రాజు గానని కొలువుం,
బిలువని పేరంటంబును,
వలువని చెలిమియును జేయ వలదుర సుమతీ! [81]



పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుఁడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని కనుఁగొనిఁ బొగడఁగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! [82]



పురికిని ప్రాణము గోమటి,
వరికిని ప్రాణంబు నీరు వసుమతి లోనన్,
గరికిని ప్రాణము తొండము,
సిరికిని ప్రాణంబు మగువ సిద్ధము సుమతీ! [83]



పులి పాలు దెచ్చి యిచ్చిన,
నలవడఁగా గుండె గోసి యఱచే నిడినన్,
దలపొడుగు ధనము బోసిన,
వెలయాలికి గూర్మి లేదు వినరా సుమతీ! [84]



పెట్టిన దినముల లోపల
నట్టడవులనైన వచ్చు నానార్థములున్,
బెట్టని దినముల గనకపు
గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ! [85]



పొరుగున బగవాఁడుండిన,
నిరవొందక వ్రాతకాఁడె యేలిక యైనన్,
ధర గాఁపు కొండెమాడిన,
గరణాలకు బ్రదుకు లేదు గదరా సుమతీ! [86]



బంగారు కుదువఁ బెట్టకు,
సంగరమునఁ బాఱిపోకు సరసుడవైతే,
నంగడి వెచ్చము వాడకు,
వెంగలితోఁ జెలిమి వలదు వినరా సుమతీ! [87]



బలవంతుఁడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా;
బలవంత మైన సర్పము
చలి చీమల చేతఁ జిక్కి చావదె సుమతీ! [88]



మదినొకని వలచి యుండఁగ
మదిచెడి యొక క్రూర విటుఁడు మానక తిరుగున్
బది చిలుక పిల్లి పట్టిన
జదువునె యాపంజరమున జగతిని సుమతీ! [89]



మండల పతి సముఖంబున
మెండైన ప్రధాని లేక మెలఁగుట యెల్లన్
గొండంత మదపు టేనుగు
తొండము లేకుండినట్లు దోఁచుర సుమతీ! [90]



మంత్రిగలవాని రాజ్యము
తంత్రము సెడకుండ నిలుచుఁ దఱచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపుఁ గీలూడినట్లు జరుగదు సుమతీ! [91]



మాటకుఁ బ్రాణము సత్యము,
కోటకుఁ బ్రాణంబు సుభట కోటి, ధరిత్రిన్
బోటికిఁ బ్రాణము మానము,
చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ! [92]



మానధనుఁ డాత్మధృతి చెడి
హీనుండగు వాని నాశ్రయించుట యెల్లన్
మానెడు జలముల లోపల
నేనుఁగు మెయి దాఁచినట్టు లెఱుఁగుము సుమతీ! [93]



మేలెంచని మాలిన్యుని,
మాలను, మొగసాలెవాని, మంగలి హితుగా
నేలిన నరపతి రాజ్యము
నేలఁ గలసి పోవుఁగాని నెగడదు సుమతీ! [94]



రాపొమ్మని పిలువని యా
భూపాలునిఁ గొల్వ భుక్తి ముక్తులు గలవే
దీపంబు లేని యింటను
జేపున కీళ్ళాడినట్లు సిద్ధము సుమతీ! [95]



రూపించి పలికి బొంకకు,
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ,
గోపించు రాజుఁ గొల్వకు,
పాపపు దేశంబు సొఱకు పదిలము సుమతీ! [96]



లావిగలవాని కంటెను
భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ
గ్రానంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ! [97]



వఱదైన చేను దున్నకు,
కఱవైనను బంధుజనుల కడ కేగకుమీ,
పరులకు మర్మము చెప్పకు,
పిరికికి దళవాయి తనము పెట్టకు సుమతీ! [98]



వరిపంట లేని యూరును,
దొర యుండని యూరు, తోడు దొరకని తెరువున్,
ధరను పతి లేని గృహమును
నరయంగా రుద్రభూమి యనఁదగు సుమతీ! [99]



వినఁదగు నెవ్వరుఁ జెప్పిన
వినినంతనె వేగ పడక వివరింపఁ దగున్
కని కల్ల నిజము దెలిసిన
మనుజుఁడె పో నీతి పరుఁడు మహిలో సుమతీ! [100]



వీడెము సేయని నోరును,
జేడెల యధరామృతంబుఁ సేయని నోరున్,
పాడంగరాని నోరును
బూడిద కిరవైన పాడు బొందర సుమతీ! [101]



వెలయాలి వలనఁ గూరిమి
గలగదు, మఱి గలిగెనేని కడతేఱదుగా;
బలువురు నడచెడు తెరువున
మొలవదు పువు, మొలిచెనేని పొదలదు సుమతీ! [102]



వెలయాలు చేయు బాసలు,
వెలయగ మొగసాల బొందు వెలమల చెలిమిన్,
గలలోనఁ గన్న కలిమియు
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ! [103]



వేసరపు జాతి గానీ,
వీసముఁ దాఁ జేయనట్టి వీరిడి గానీ,
దాసి కొడుకైనఁ గానీ,
కాసులు గల వాఁడె రాజు గదరా సుమతీ! [104]



శుభముల పొందని చదువును,
నభినయముగ రాగరసము నందని పాటల్,
గుభ గుభలు లేని కూటమి,
సభ మెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ! [105]



సరసము విరసము కొఱకే,
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే,
పెరుగుట విరుగుట కొఱకే,
ధర తగ్గుట హెచ్చు కొఱకె తథ్యము సుమతీ! [106]



సిరి తా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్,
సిరి తాఁ బోయినఁ బోవును
కరి మ్రింగిన వెలగ పండు కరణిని సుమతీ! [107]



స్త్రీల యెడ వాదులాడకు,
బాలురతోఁ జెలిమిచేసి భాషింపకుమీ,
మేలైన గుణము విడువకు,
మేలిన పతి నింద సేయ కెన్నఁడు సుమతీ! [108]